దిబ్బు, దిబ్బు దీపావళి
మళ్లీవచ్చే నాగులచవితి
అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం యావత్తు భారతదేశంలోని చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు.
దీపావళి అంటే అర్థం ఏమిటి?
దీపావళి పదాన్ని విడదీస్తే, దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఇంటి చుట్టూ వరసగా దీపాలు పేర్చటం, ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది అందగా దీపాలు అలకరించటం వెనుక ప్రధాన ఉద్దేశం: దీపం ‘తిమిర సంహారం,’ జ్ఞాన స్వరూపి. తిమిరం అంటే అజ్ఞానం, అంధకారం. మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్యోతిని వెలిగిస్తుంది దీపం. ఆ పరంజ్యోతికి సంకేతకంగా మనం దీపాలను వెలిగిస్తాం. అలాగే, దీపంలో కన్పించే ఎర్రని కాంతిని బ్రహ్మదేవునిగా, నీలకాంతి విష్ణువుకు ప్రతిరూపంగా, తెల్లటికాంతి పరమశివునికి ప్రతిగా మన పురాణాలు చెపుతున్నాయి. ఇక దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించటం కూడా అనాదిగా వస్తున్నదే.
దీపావళికున్న వివిధ పేర్లు:
ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమైన దీపావళి పండుగను అనేక పేర్లతో పిలుస్తారు. ముద్రారాక్షసాన కౌముదీ మహోత్సవంగా పిలవబడే దీపావళిని జైనులు దీప ప్రతిపదుత్సవంగా జరుపుకుంటారు. బౌద్ధ జాతక కథలలో లక్షదీపోత్సవము, దీపదానము జరిపి బుద్ధభగవానుని చుట్టూ దీపాలు పెట్టి పూజించినట్టుగా చెపుతుంటారు. సింహాసన ద్వాత్రింశతిలో దీనిని దివ్వెల పండుగగా చెప్పబడింది.
దీపావళి ఎందుకు జరుపుతారు?
ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా – 1. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి వధించటం, 2. వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు యాచించి, వానిని పాతాళానికి తొక్కటం, 3. రావణ వథానంతరం శ్రీరాముడు రాజ్యపట్టాభిషక్తుడవడం, 4. నరకము నుండి విముక్తి పొందడానికి యమునికి పూజచేయటం, చివరగా, 5. విక్రమార్క చక్రవర్తి ఈ రోజున పట్టాభిషక్తుడవటంతోపాటు విక్రమార్కశకం ప్రారంభం కావటం.
అంతేకాక, దీపావళి పితృదేవతల పండుగ. సూర్యుడు దీపావళినాడు తులారాశికి ప్రవేశిస్తాడు. నాడు లోకులు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గ దర్శనం చేస్తారు. అలాగే, ‘యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని యమధర్మరాజుని పూజిస్తారు. మనదేశంలో ఉత్తరాయణం మకర సంక్రాంతి నాడు మొదలవుతుంది. కానీ, ఉత్తర ధ్రువమందు తుల సంక్రాంతినాడు వస్తుంది. కావున దీపావళినాడు ధ్రువమండలంలో దక్షిణాయనము మొదలవుతుంది. దక్షిణాయనములో చీకటిగా ఉంటుంది. అందుకే, ఆ కాలంలో చనిపోయినవారికి ఉత్తరాయణం వచ్చాక శ్రాద్దకర్మలు ఆచరిస్తారు. ఈ సమయాన పితృదేవతలు నరకాన ఉండిపోతారు. కావున యమునికి పూజచేయుట అనే ఆనవాయితీ వచ్చింది. దీపావళి నాడు మొదలుపెట్టి కార్తీకమాసమంతా ఇంటి ముందర దీపాలు పెడతారు. అలా పెట్టటం వల్ల తులాసంక్రమణనాటి దీర్ఘరాత్రి పితృదేవతలకు ఈ దివ్వెలు మార్గదర్శకంగా ఉంటాయని కూడా పెద్దలు చెపుతారు.
శాస్త్రీయ దృక్పథం: మన సంస్కృతి, సాంప్రదాయాలను తరచి చూస్తే వాటిల్లో ఎంతో, కొంత శాస్త్రీయత, ప్రకృతి ఆరాధన, పర్యావరణ సంరక్షణ మనకు కన్పిస్తాయి. దీపావళి పండుగకు కూడా అలాంటి విశేషమే ఉంది. ఆశ్వీయుజ మాసం అంటే దసరా సమయంలో వచ్చే వానలు తగ్గుముఖం పట్టి, దీపావళినాటికి శరదృతువు మొదలవుతుంది. పచ్చని పైరులతో పుడమి పులకిస్తుంది. క్రిమి, కీటకాదులు ప్రబలే సమయం. అందుకని పూర్వకాలం దీపాలను ఆముదం నూనెతో పెట్టేవారు. ఆముదం నూనె పర్వావరణానికి మేలు చేయటమేకాక, దీపాలకు ఆకర్షితమై వాటిని చేరే క్రిమి, కీటాదాలు నాశనం అయ్యేవి. అలాగే మనం కాల్చే బాణాసంచా. ఈ సాంప్రదాయం గత ఐదు వందల సంవత్సరాల నుంచి మాత్రమే మొదలైందని చెప్పాలి. అప్పట్లో ఇంట్లోనే తయారు చేసుకునే మతాబులలో గంధకాన్ని నింపేవారు. దాని నుంచి వచ్చే పొగ కూడా అనేక పురుగలను నాశనం చేసేవి. దాంతో అది కూడా ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కానీ, నేడు మన సాంప్రదాయాల ఉద్దేశాలు మర్చిపోవటంతో, ఆ సాంప్రదాయాలు వెర్రితలలు ఎత్తి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
దీపావళి, ఐదురోజుల పండుగ:
ఆచారవ్యవహారాలలో తేడాలున్నప్పటికీ, దీపావళి పండుగను ఆంధ్రానాట మూడు రోజులు మొదటిరోజు నరక చతుర్దశి, రెండవనాడు దీపావళి అమావాస్య, మూడో రోజు బలి పాడ్యమిగా జరుపుకుంటారు. అయితే ధన త్రయోదశి, భగనీ హస్తభోజనం (భాయిదూజ్)లతో కలిపి ఐదురోజులు ఈ పండుగను జరుపుకునే ఆనవాయితీని ఉత్తరదేశాన మనం చూడవచ్చు.
ధన త్రయోదశి: క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ప్రకటించి మహావిష్ణువు భార్యగా స్వీకరించాడు. అలాగే భృగుమహర్షిపైన ఆగ్రహంతో భూలోకానికి లక్ష్మీదేవి చేరిన ఈ ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. అంతేకాక ఔషదకర్త ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. అందుకే ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, సంపదలను కలుగ చేస్తుందని నమ్ముతారు.
బలిపాడ్యమి: వటువు రూపంలో బలిని పాతాళానికి తొక్కగా సంవత్సరానికి ఒక్కసారి ఈ పాడ్యమినాడు బలి భూమ్మీదకు వస్తాడని పురాణ గాథ. అందుకే దీపావళి మర్నాడు బలిపాడ్యమిగా బలికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడు ఈ పాడ్యమినాడే గోవర్ధనగిరి ఎత్తి రేపల్లీయులను ఇంద్రుని కోపాగ్ని బారి నుంచి కాపాడాడు.
భగినీహస్తభోజనం లేదా భాయీదూజ్: చాలామందికి రాఖీ పౌర్ణమి గురించి మాత్రామే తెలుసు. కానీ, సోదర, సోదరి ప్రేమకు నెలవుగా నిలిచే ఈ పండుగ దక్షిణాది కంటే ఉత్తరాదిలో ప్రసిద్ధి. సూర్యభగవానుడి కూమారుడైన యముడు, కుమార్తె యమనకు సంబంధించిన పురాణ కథ ఈ పండుగకు మూలం. తన సోదరుని పట్ల ప్రేమతో ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాని యముడు కార్తీక శుద్ద విదియనాడు తప్పకుండా వస్తానని తన సోదరికి ప్రమాణం చేస్తాడు. అన్నప్రకారం ఆ రోజు యమున ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరిస్తాడు. ప్రతీ సంవత్సరం ఇదేవిధంగా ఈ ఒక్కరోజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవల్సిందిగా యమున అన్నగారిని కోరుతుంది. నాటి నుంచి నేటి వరకు సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు కార్తీక శుద్ధ విదియనాడు వెళ్లి విందు ఆరగించటం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల వనవాసాంతరం అయోధ్య చేరిన రాముడు, భరతుడు కలుసుకున్న ఈ విదయను భాతృ విదియ లేదా భరత్ మిలాప్ అని కూడా పిలుస్తారు.
సమాజ సాంప్రదాయాలు:
పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన సుదినం కూడా ఈ రోజే. అందుకే చాలామంది దీపావళి సాయంత్రం లక్ష్మీపూజలను ఆచరిస్తుంటారు. అలాగే, ఉత్తరాదివారితో పాటు దక్షిణాది వ్యాపారస్తులు కూడా లక్ష్మీపూజలు చేసి ఆదాయ, వ్యయములకు సంబంధించిన లెక్కలను కొత్త పుస్తకాలలో రాయటం ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. మన ఆంధ్రనాట ఈ మాసంలో కేదారగౌరి వ్రతాలు ఆచరించే సాంప్రదాయం కూడా ఉంది. అశ్వయుజ అమావాస్య, కార్తీకమాస ప్రారంభములో కొన్ని ప్రాంతాలలో పంటలు ఇంటికి వస్తాయి. ‘కేదారమ’నగా సస్యశ్యామలమైన భూమి. క్షేత్రలక్ష్మిని గౌరిగా భావించి కేదారగౌరీ వత్రాన్ని ఆచరిస్తారు. ఈ నోమున తొమ్మిది రకాల పండ్లు, తొమ్మిది రకాలు పువ్వులు, తొమ్మిది రకాలు కూరగాయలు, ఆ ఋతువున పండే ధాన్యాలతో తొమ్మిది రకాల పిండివంటలతో పార్వతీ, పరమేశ్వరులను పూజిస్తుంటారు.
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రువృద్ధి వినాశాయ దీపంజ్యోతి నమోస్తుతే
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.